నిద్రలేమి.. ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, సరైన శారీరక శ్రమ లేకపోవడం, 24 గంటలు స్క్రీన్ ముందే గడపటం.. ఇలా చాలా కారణాలున్నాయి. మనిషి ఆరోగ్యాన్ని నిద్ర చాలా ప్రభావితం చేస్తుంది. సరైన నిద్ర లేకపోతే ఆ రోజంతా నీరసంగా.. చికాకుగా అనిపిస్తుంది. ఇది అలాగే కొనసాగితే మానసిక ఆరోగ్యానికి ముప్పును కలిగిస్తుంది. అందుకే రాత్రి సరిగ్గా నిద్రపోవాలి. అయితే ప్రస్తుత కాలంలో రాత్రి నిద్ర పట్టకపోవడానికి.. చాలా మందిని నిద్రకు దూరం చేస్తున్న కొన్ని కారణాల గురించి తెలుసుకుందామా..?
ఫోన్ల వాడకం..
నిద్ర పట్టకపోవడానికి.. కంటినిండ నిద్ర ముంచుకొస్తున్నా పడుకోకపోవడానికి ముఖ్యమైన కారణం ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం. ఫోన్, ల్యాప్టాప్, ఐపాడ్.. ఇలా రకరకాల పేరుతో ఇవి నిద్రను పాడుచేస్తున్నాయి. ప్రస్తుతం ఇది అతి పెద్ద సమస్యగా మారింది. అయితే నిద్ర రావడానకి 2 గంటల ముందు ‘మెలటొనిన్’ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇదే నిద్ర రావడానికి ప్రధాన కారణం. మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల ఈ హార్మోన్ విడుదల అనేది ఆగిపోతుంది. దీని వల్ల నిద్రపట్టకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే నిద్రపోవడానికి 2 గంటల ముందే ఫోన్ను దూరం పెట్టాలని వైద్యులు చెబుతున్నారు.
వయసు సంబంధిత సమస్యలు..
వృద్ధాప్యంలో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. చాలా రకాలు నొప్పులు వారిని ఇబ్బంది పెడుతుంటాయి. రకరకాల మెడిసిన్లను వాడుతుంటారు. అలాగే రాత్రి సమయంలో మూత్రానికి లేవడం కూడా వారికి కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమస్యల వల్ల వారు రాత్రి సమయంలో సరైన నిద్రను పొందలేరు. దీని వల్ల వారు సరైన నిద్రలేక ఒత్తిడికి గురవుతుంటారు. అయితే వృద్ధులు రాత్రి సమయంలో కెఫిన్ పదార్థాలను తీసుకోకుండా ఉండటం, పడుకునే ముందు వేడి పాలను తాగడం వల్ల వారు మంచి నిద్రను పొందే అవకాశం ఉంది.
మద్యం సేవించడం..
పడుకోవడానికి ముందు టీ, కాఫీలు మానేయాలి. ఇదే నిద్రకు ప్రధాన ఆటంకం. ఇందులో నుంచి వచ్చే కెఫిన్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. అలాగే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రిఫ్రెష్ అయిన భావన కలుగుతుంది. శరీరం డీహైడ్రేట్ అవ్వటం వల్ల నిద్ర అనేది పట్టదు. కాబట్టి నిద్ర పోవడానికి ముందు కెఫిన్, మద్యం సేవించకపోవడం ఉత్తమం.
షిప్టులతో చిక్కులు..
ప్రస్తుత కాలంలో అర్ధరాత్రి.. అపరాత్రి అంటూ తేడా ఏం లేకుండా పలు కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకే పరిమితం చేస్తున్నాయి. చిత్రవిచిత్రమైన సమయాల్లో షిఫ్టులు వేస్తూ ఉద్యోగుల ఆరోగ్యానికి కాస్త ముప్పును తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా నైట్ షిప్టు పడిన వారు రాత్రంతా మేల్కోవాల్సి వస్తుంది. పడుకునే సమయంలో పని చేయాల్సి వస్తుంది. పగటి పూట నిద్రపోవాల్సి వస్తుంది. పడుకునే సమయంలో కళ్లు తెరచి ఉండటం, పగటి పూట పడుకొని ఉండటం నిద్రకు అతిపెద్ద భంగంగానే చెప్పొచ్చు.
పడుకునే ముందు ఇవి తినొద్దు..
పడుకునే ముందు హెవీ ఫుడ్ తినొద్దని నిపుణులు చెబుతున్నారు.ప్రొటీన్ జీర్ణం అవ్వటానికి చాలా సమయం పడుతుంది. అందుకే అధిక ప్రొటీన్ ఉన్న మాంసం, బిర్యానీ లాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్కువ శక్తి అందుతుంది. జీర్ణక్రియ 50శాతం అలస్యమవుతుంది. అందుకనే రాత్రి సమయంలో తొందరగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్ ఆహారాన్ని తీసుకుంటే హాయిగా నిద్రపోవచ్చు.