ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఎన్నికల నగారా మోగింది. రేపే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొత్తం 60 స్థానాలకు రేపు ఓటింగ్ జరగనుంది.
పోలింగ్ కు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కిరణ్‌కుమార్ దినకర్రో వెల్లడించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ రేపు ఉదయం 7గంటలనుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 28.13లక్షల మంది ఓటర్లు ఉండగా.. 3,337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వీటిలో 1,100 కేంద్రాలను సున్నితమైనవిగా.. 28 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్టు తెలిపారు.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-ఐపీఎఫ్‌టీతో కలిసి పోటీ చేస్తుండగా.. సీపీఎం-కాంగ్రెస్‌తో జట్టుకట్టి బరిలో నిలిచింది. ఇకపోతే, తిప్రా మోతా పార్టీ సొంతంగానే ఎన్నికల రంగంలోకి దూకింది. ఈ ఎన్నికల కోసం 31వేల మంది పోలింగ్ సిబ్బంది, 25వేల మంది కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిషేధాజ్ఞలు విధించగా, ఇవి ఫిబ్రవరి 17న సాయంత్రం 6గంటలవరకు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.