ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ను ఢిల్లీ కోర్టు సీబీఐ కస్టడీకి ఇచ్చింది. మనీశ్ సిసోడియాకు 5 రోజుల సీబీఐ రిమాండ్‌ను విధించింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ జిల్లా న్యాయస్థానం. ఆదివారం సిసోడియాను అరెస్టు చేసిన సీబీఐ.. 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సోమవారం న్యాయస్థానంలో సిసోడియాను హాజరుపరిచింది. సానుకూలంగా స్పందించిన కోర్టు మార్చి 4 వరకు రిమాండ్‌కు అనుమతినిచ్చింది. అంతకుముందు కోర్టులో వాదనలు వినిపించిన మనీశ్ తరఫు న్యాయవాది.. ఈ కేసులో మంత్రి పాత్ర ఏమి లేదని తెలిపారు.
మరోవైపు.. ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నారని సీబీఐ తరఫు లాయర్ న్యాయమూర్తికి నివేదించారు. అయితే ఈ కేసులో లోతైన దర్యాప్తు కోసం మనీశ్ సిసోడియా నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు తమకు 5 రోజుల కస్టడీకి అప్పగించాలని సీబీఐ న్యాయవాది కోర్టును కోరారు. రిమాండ్‌కు సంబంధించి సీబీఐ చేసిన విజ్ఞప్తిని వ్యతిరేకించారు మనీశ్ లాయర్. మంత్రి ఫోన్ మార్చారని అధికారులు చెబుతున్నారని.. అయితే మొబైల్ మార్చడం నేరం కాదని ఆయన న్యాయమూర్తికి చెప్పారు. ఈ వ్యవహారంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి కూడా సలహాలు తీసుకున్న తర్వాతే నూతన మద్యం విధానాన్ని అమలు చేశామని.. ఇందులో ఎటువంటి కుట్ర జరిగే అవకాశమే ఉండదని ఆయన కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. సీబీఐ కస్టడీకి సిసోడియాను అప్పగించింది.