ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఒక రేంజ్లో మండిపోతున్నాయి. భానుడి భగభగలను ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. వడగాలుల తీవ్రత రోజురోజుకీ ఎక్కువవుతోంది. సూర్యుడి ప్రతాపంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఆంధ్రప్రదేశ్లో సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని చోట్లా పగటి ఉష్ణోగ్రతల తీవ్రత 40 డిగ్రీలకు పైగానే ఉందని తెలిపింది. ఉష్ణోగ్రతల తీవ్రత ఇంతగా పెరగడానికి వాయువ్య భారత్ నుంచి వీస్తున్న వేడిగాలులే కారణమని వాతావరణ విభాగం పేర్కొంది.
తాజాగా విజయవాడ నగరంలోని గీతా నగర్ ఐడీఎఫ్ సీ బ్యాంకు భవనంపై ఉన్న సెల్ ఫోన్ టవర్ ఉన్నట్లుండి కాలిపోయింది. దీంతో స్దానికంగా ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. బ్యాంకు సిబ్బందితో పాటు స్ధానికులు భయంతో పరుగులు తీశారు. ఫైర్ స్టేషన్ కు కాల్ చేయడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి పరిస్ధితి అదుపులోకి తెచ్చారు. విజయవాడలో పెరిగిన వడగాల్పుల తీవ్రత కారణంగా పెరిగిన వేడికి సెల్ ఫోన్ టవర్ మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దట్టమైన పొగ అలుముకుంది.