బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏపీ బీజేపీ వర్గాలు జనసంవాద్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశిస్తూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆమె ఏపీ కి కేంద్ర ప్రభుత్వం తరఫున అందుతున్న నిధులను గురించి చెప్పారు, రాష్ట్రంలో టీడీపీ కుటుంబ పాలన వైసీపీ కుల రాజకీయాలు ఉన్నాయని ఆమె అన్నారు. రాష్ట్రంలో ఉన్న వైసీపీ పాలన గురించి ప్రస్తావిస్తూ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. జగన్ పాలన అస్సలు బాగోలేదని, జగన్ కు కేంద్రంతో అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలు అస్సలు బాగోలేవని ఆమె అన్నారు. రాష్ట్రం కరప్షన్, కుటుంబ పాలన, కుల రాజకీయాల మధ్య చిక్కుకుపోయి ఉక్కిరి బిక్కిరి అవుతుందని ఆమె అన్నారు. ఏడీబీలాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు తీసుకుని చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాల అమలులో ఇబ్బంది కలిగిస్తే అవి పూర్తికావడం చాలా కష్టమన్నారు. కారణాలు ఏవైనా ఒప్పందాలను రద్దు చేసినట్టు ప్రకటిస్తే దేశానికి అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టుల్లో ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించాలని నిర్మల సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అలాంటి తప్పు చేస్తే బీజేపీ వర్గాలు ఊరూరూ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం తో పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.
ఒకరిది కుల రాజకీయం..! మరొకరిది కుటుంబ పాలన.. ఇది ఏపీ పరిస్థితి..!
-