కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్) అంశంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. సెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశం పొందేందుకు గాను విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది. కాగా సదరు పరీక్షను 2022 ఆరంభంలో నిర్వహించనున్నట్లు కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహిస్తామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వివరాలను వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఔత్సాహికులైన అభ్యర్థులకు ప్రవేశం కల్పించేందుకు పరీక్ష నిర్వహిస్తామని, ప్రధాని మోదీ స్వయంగా ఇందులో చొరవ తీసుకుంటున్నారని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ ఏడాది ముగిసేలోపే ఈ పరీక్షను నిర్వహిస్తామన్నారు. కోవిడ్ వల్ల ఈ పరీక్ష ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ సరైన సమయంలోనే నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు.
A Common Eligibility Test (CET) for job aspirants will be conducted across the country from early 2022 to screen and shortlist candidates for recruitment to Central government jobs: Union Minister Jitendra Singh pic.twitter.com/bWC5XGPGAq
— ANI (@ANI) July 6, 2021
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే యువతలకు ఈ టెస్టు ద్వారా ఉద్యోగాలను సాధించడం ఎంతో సులభతరం అవుతుందని, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ ఆధ్వర్యంలో అన్ని అంశాలను పర్యవేక్షిస్తామని తెలిపారు.
ఈ టెస్టు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న యువత అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనేదే ప్రధాని మోదీ ఉద్దేశమన్నారు. కామన్ ఎలిజిబిలటీ టెస్టును నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ)కు కేంద్ర కేబినెట్ అనుమతి లభించిందన్నారు. ఎన్ఆర్ఏ ఆధ్వర్యంలో పరీక్షను నిర్వహించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారని, తరువాత ఉద్యోగాలకు ఎంపిక చేస్తారన్నారు. కాగా ప్రస్తుతం స్టాఫ్ సెలెక్షన్ కమిటీ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్‌ల ఆధ్వర్యంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కొత్త పరీక్ష విధానంతో అభ్యర్థులకు పరీక్షలు రాయడం, ఉద్యోగాలను పొందడం సులభతరం అవుతుంది.