తిరుపతి పార్లమెంటు స్థానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో ముందే కూసిన కోయిల మాదిరిగా చంద్రబాబు.. ఇక్కడ నుంచి మళ్లీ కేంద్ర మాజీ మంత్రి, గత ఏడాది ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి విఫలమైన పనబాక లక్ష్మికి ఆయన టికెట్ ఇచ్చారు. మొదట్లో కొంత తర్జన భర్జనకు గురైనా.. తర్వాత మాత్రం రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల నియోజకవర్గంలోని కీలక నేతలతో పనబాక భేటీ అయ్యారు. అయితే.. కొందరు ఆమెకు సహకరించేందుకు ముందుకు వచ్చినా.. మరికొందరు మాత్రం కారణాలు ఏవైనా ముఖం చాటేశారు. దీంతో పనబాకలో అసంతృప్తి నెలకొంది.
అయితే.. తనకు మద్దతుగా ప్రచారం చేసేందుకు ఎవరిని నియమించినా.. తనకు చెప్పే కదా చేస్తారు? అనుకున్న పనబాక ఈ విషయంలో మౌనం పాటించారు. అయితే.. ఇంతలోనే చంద్రబాబు ఆదేశాల మేరకు ఎస్సీ నాయకురాలు, తెలుగు మహిళ రాష్ట్ర చీఫ్ మాజీ ఎమ్మెల్యే వంగల పూడి అనిత రంగంలోకి దిగిపోయారు. తాజాగా ఆమె తిరుపతి ఉప ఎన్నికల్లో పనబాక తరఫున చక్రం తిప్పాలని నిర్ణయించుకున్న ట్టు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు ఆదేశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే తిరుపతికి చేరుకున్న అనిత. వారంలో నాలుగు రోజులు తిరుపతిలోనే ఉండి నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేస్తారట.
అంతేకాదు.. మహిళా ఓటు బ్యాంకును టీడీపీకి అనుకూలంగా మార్చే ప్రయత్నం కూడా ముమ్మరం చేస్తారని అంటున్నారు. అయితే.. ఇప్పటికే ఆమె కూడా గత ఏడాది ఎన్నికల్లో ఓడిపోయి ఉండడం. పార్టీలో ఆమెకు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలు సాగుతుండడం, అనిత కుటుంబలోనూ వివాదాలు ఉండడంతో పనబాక.. షాక్ కు గురయ్యారు. ఈమె నాకు ఏం చేస్తుందని.. అంతర్మథనం చెందుతున్నారట. ఈ క్రమంలో మరోసారి చంద్రబాబును కలిసి.. తనకు సపోర్టుగా ఉండేందుకు మరో నేతను చూడాలని అభ్యర్థించనున్నట్టు తెలుస్తోంది. మరి బాబు ఏమంటారో చూడాలి.