సరికొత్త రాజకీయం: చంద్రబాబుకు టీడీపీ నేతల “వెన్నుపోటు”!

-

తెలుగు రాజకీయాల్లో “వెన్నుపోటు” అనే టాపిక్ ఎత్తితే పెద్ద ఉపోద్ఘాతమే రాయాల్సి వస్తోంది కాబట్టి… డైరెక్టుగా పాయింట్ లోకి వచ్చేస్తే… బాబు వంటి రాజకీయ ఉద్దండపండితులకు కూడా “వెన్నుపోటు” పొడుస్తున్నారు కొందరు టీడీపీ నేతలు! వారిచ్చే స్టేట్ మెంట్లు బాబును అడిగి ఇస్తున్నారో.. వారి వ్యక్తిగత అభిప్రాయంగా చెబుతున్నారో తెలియదు కానీ.. బాబు పోరాటానికి “వెన్నుపోట్లు” పొడిచేలా మాట్లాడుతున్నారు!

వివరాళ్లోకి వెళ్తే… ప్రస్తుతం బాబుకి ఉన్న రాజకీయ, సామాజిక, వ్యక్తిగత సమస్య ఏదైనా ఉందంటే.. అది అమరావతిలోనే పూర్తి రాజధాని ఉండాలనే విషయం! మూడు రాజధానుల బిల్లు వచ్చినప్పటినుంచి బాబు కంటిమీద కునుకులేకుండా ఆలోచిస్తున్నారు.. ఆన్ లైన్ లో మాట్లాడుతున్నారు.. జూం లో పోరాడుతున్నారు! అవసరమైతే “బెజవాడ బెంజ్ సర్కిల్ లో ఆమరణ నిరాహార దీక్ష”కు దిగడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సమయంలో బాబు పోరాటాన్ని, వ్యూహాన్ని అర్ధం చేసుకోలేని కొందరు టీడీపీ నేతలు… “రాయలసీమలో రాజధాని” కావాలని అడుగుతున్నారు!

మూడు రాజధానులతో పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా… రాయలసీమ ప్రాంతానికి చెందిన కర్నూలుకు “జ్యుడీషరీ క్యాపిటల్” హోదా ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా కాకుండా “అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్” అవకాశం రాయలసీమకు ఇవ్వాలనే కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు టీడీపీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మొదలైన టీడీపీ నేతలు! దీంతో తమ్ముళ్లు వీరి మాటలకు తెగ ఫీలవుతున్నారు!

ఒకపక్క అమరావతికోసం అవసరమైతే ప్రాణాలు ఇచ్చే రేంజ్ లో బాబు ఆమరణ నిరాహారదీక్ష, ప్రస్తుతానికున్న 20మంది ఎమ్మెల్యేలతో రాజినామాలు చేయించడం వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుని… “అమరావతే రాజధాని.. అమరావతి మాత్రమే రాజధాని”గా ఉండాలని పోరాటాలు చేస్తుంటే… ఆ పోరాటాలను నీరుగార్చే విధంగా కొందరు తమ్ముళ్లు ఇలా వ్యక్తిగత ఎజెండాలను అమలుపరుస్తున్నారు. దీన్నే… బాబుకు వెన్నుపోటు పొడవడంగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు!

Read more RELATED
Recommended to you

Exit mobile version