ఎప్పటికప్పుడు స్పీచ్ లతో జనాలకు కాస్త బోర్ కొట్టించే టిడిపి అధినేత చంద్రబాబు ఇటీవల కాలంలో తన పంథా మారుస్తున్నారు. బహిరంగ సభలైన, మీడియా సమావేశాలైన ఏకధాటికి మాట్లాడుతూ లెక్చర్ ఇచ్చే బాబు..ఈ మధ్య పంచ్ లు వేయడం, ఏ విషయన్నైనా సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో బాబు స్పీచ్‌లు మారాయి. ప్రత్యర్ధులపై సెటైర్లు వేయడం పెరిగింది. వయసు పెరిగేకొద్ది తన స్పీచ్ ల్లో ఫైర్ పెంచుతున్నారు.
ఇటు మీడియా సమావేశాల్లో కూడా సాగదీత లేకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తున్నారు. తాజా బాబు మీడియా సమావేశం చూస్తే అదే అనిపిస్తుంది. ఆయన ఏ మాత్రం ల్యాగ్ లేకుండా వైసీపీకి కౌంటర్లు ఇచ్చేశారు. ఇటీవల కాలంలో టిడిపిని ఇరుకున పెట్టాలని వైసీపీ..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలని చంద్రబాబు కొన్నారని వైసీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దానికి బాబు గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ పార్టీ ఎన్ని కోట్లు ఇచ్చి కొనుగోలు చేసిందని ప్రశ్నించారు. “దేవుడి స్ర్కిప్ట్ అన్నారు. ఏమయ్యింది? మాకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 22 ఓట్లు వస్తే మాకు ఒక ఎమ్మెల్సీ వస్తుంది. ఆ సీటు మాకు వదిలేస్తే పోయేది కదా? ఎందుకు పోటీ పెట్టారు? నువ్వు ఎదుటి పార్టీ వారిని తీసుకొంటే నీతి… మాకు ఎవరైనా ఓట్లు వేస్తే అవినీతా?” అని ఫైర్ అయ్యారు.
‘నేను పేదల ప్రతినిధి… చంద్రబాబు ధనికుల ప్రతినిధి’ అని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇసుకలో నెల కు రూ.250 కోట్లు దోచుకొంటున్నవాడు పేదల ప్రతినిధా? అని ప్రశ్నించారు. టీడీపీ 175 సీట్లలో పోటీ చేస్తుందా? అని జగన్ విసురుతున్న సవాళ్లపై బాబు ఫైర్ అయ్యారు. అసలు ఆ ప్రశ్న అడగడానికి ఆయన ఎవరు? అని, బుద్ధి ఉంటే ఆ ప్రశ్న అడుగుతారా? తాము ఎన్ని సీట్లలో పోటీ చేస్తాం అన్నది కాదని, వైసీపీని 175 సీట్లలో ఒక్కచోట కూడా గెలవనివ్వమని అన్నారు. మొత్తానికి బాబు లాజిక్ లతో కౌంటర్లు ఇచ్చేశారు. మరి మాటలు జనం ఎలా తీసుకుంటారో చూడాలి.