ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన నేపధ్యంలో దానిపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీనిపై చంద్రబాబు మాట్లాడారు. అసెంబ్లీ లో వైసీపీ నాయకుల నేరాల గురించి కూడా చర్చిస్తే బాగుండేది అని చంద్రబాబు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
అసెంబ్లీలో ఉన్న నేరస్తుల ముఠాను జగన్ కీర్తిస్తున్నారని, వైసీపీ ఎమ్మెల్యేల్లో 57 శాతం మంది నేర చరిత్ర ఉన్న వాళ్ళే అని చంద్రబాబు ఆరోపించారు. మండలికి జగన్ ప్రభుత్వం రాజకీయాలు ఆపాదిస్తు౦దన్న ఆయన, మండలిని కావాలని పది రాష్ట్రాలు కోరుతున్నాయని అన్నారు. ఒకే రోజు కేబినేట్, అసెంబ్లీ పెట్టి బిల్లులను ఆమోదిస్తున్నారన్న ఆయన మండలిలో తెలుగుదేశం చేసిన తప్పేంటి అని ప్రశ్నించారు.
ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మండలి పని చేస్తుందని జగన్ అంటున్నారని, జగన్ కోర్ట్ కి వెళ్ళడానికి భద్రతా ఖర్చులకు ఏడాదికి 30 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. శాసన మండలికి 60 కోట్లు ఖర్చు చేస్తే తప్పు ఏంటీ…? అని ప్రశ్నించారు. కౌన్సిల్ పెట్టాలని టీడీపీ ఎప్పుడూ నిర్ణయం తీసుకోలేదని చంద్రబాబు స్పష్టం చేసారు. మండలికి ఏటా 60 కోట్లు ఖర్చు చేస్తున్నారని జగన్ గగ్గోలు పెడుతున్నారన్నారు.
పార్టీలో చర్చ జరిగిన తర్వాత కౌన్సిల్ ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారం చేయడం కోసం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు వస్తున్నారని అన్నారు. జగన్ అందరికి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఇస్తామని హామీ ఇచ్చారని చంద్రబాబు అన్నారు. మాట తప్పను మడం తిప్పను అని జగన్ అన్నారని, ఆ రోజు చెప్పింది ఏంటీ ఈ రోజు చేసింది అని ప్రశ్నించారు.