ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడా లేకుండా ప్రతిచోటా నాయకుల మధ్య విభేదాలు స్పష్టంగా నడుస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉంటూ అధికార పార్టీపై పోరాటం చేస్తూ బలపడాల్సిన తెలుగుదేశం పార్టీ, సొంత నాయకుల వల్లే ఇంకా వీక్ అవుతూ వస్తుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో నాయకుల మధ్య విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి.
కార్యకర్తలని నాయకులు పట్టించుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు. అలాగే ఇద్దరు నాయకుల వల్ల పార్టీ నాశనమైపోతుందంటూ విమర్శలు చేశారు. అయితే జేసి వ్యాఖ్యలని సొంత పార్టీ నాయకులే ఖండిస్తూ వచ్చారు. వరుసపెట్టి అనంత టిడిపి నేతలు జేసిపై విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో జేసి వర్గం…పల్లె రఘునాథ్, ప్రభాకర్ చౌదరీలు…వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డితో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో వదిలి మరో సంచలనం సృష్టించారు.
ఇలా అనంతలో నాయకుల మధ్య జరుగుతుందనుకునే సమయంలోనే గుంటూరులో టిడిపి కార్యకర్తలు, దివంగత కోడెల శివప్రసాద్ తనయుడు శివరాంపై రివర్స్ అయ్యారు. కోడెల సొంత గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలు శివరాంపై ఫైర్ అవుతూ ఓ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. శివరాం అవినీతితో పార్టీ భ్రష్టుపట్టి పోయిందని, గత ఎన్నికల్లో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో టీడీపీ ఓటమి పాలు కావడానికి కోడెల శివరాం కారణమని కార్యకర్తలు ఫైర్ అయ్యారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నేతల మధ్య లుకలుకలతో చంద్రబాబుకు లేనిపోని తలనొప్పులు వస్తున్నాయి.