తెలంగాణ టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. దేశంలో తెలంగాణ నంబర్ 1గా ఎదగడానికి పునాది వేసింది తెలుగు దేశం పార్టీయేనని పేర్కొన్నారు. వెనుకబడిన తెలంగాణ ఒక్క నిర్ణయంతో ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ చంద్రబాబు సమక్షంలో బాధ్యతలు చేపట్టారు.
ఎక్కడ ఉన్నా పదవికి వన్నె తెచ్చే వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ అని వ్యాఖ్యానించారు. టెక్నాలజీలో చూస్తే తెలుగు వాళ్లు బాగా రాణిస్తున్నారని కొనియాడారు. హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు వచ్చాయన్న ఆయన.. భాగ్యనగరంలో ల్యాండ్ విలువ బాగా పెరిగిందన్నారు. హైదరాబాద్ ఐటీ అభివృద్ధికి నాంది వేసింది టీడీపీ కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. వ్యవసాయం చేసే రైతుబిడ్డ నాగలితో పాటు.. మౌస్ పట్టుకోవాలని ఆరోజే చెప్పానని ఆయన వ్యాఖ్యానించారు. వెనుకబడిన వర్గాలకు ఒక పార్టీ ఉండాలని ప్రజలు చూస్తున్నారని.. వాళ్లందరికీ టీడీపీ సరైన వేదిక అన్నారు.