ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కంచుకోటగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అంతకంటే ఎక్కువ మెజార్టీ సాధించాలనే లక్ష్యంతో ప్రణాళికలను రచిస్తుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్.. వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు జగన్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
ఈసారి ఎలాగైనా కుప్పం నియోజకవర్గంలో వైసిపి జెండా ఎగురవేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కుప్పం నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా ఉన్న భరత్ కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతోపాటు రానున్న ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని కూడా చేస్తానని చెప్పారు జగన్. అదే సమయంలో కుప్పం నియోజకవర్గానికి కూడా భారీ నిధులు కేటాయించారు. సీఎం జగన్ ఆదేశాలతోనే చంద్రబాబు నియోజకవర్గమైనటువంటి కుప్పం పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి తరచు కుప్పంలో పర్యటిస్తూ రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలను రచిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్పర్సన్ నారా భువనేశ్వరి కూడా కాజాగా కుప్పంలో పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. కుప్పంలో టిడిపి ఓటు బ్యాంకు చేజారి పోకుండా చూసే చర్యల్లో భాగంగా భువనేశ్వరి పర్యటించారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కుప్పం పర్యటనలో భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో కుప్పంలో ఏర్పాటు చేసిన సంజీవని ఉచిత వైద్యశాలను ప్రారంభించడంతో పాటు శాంతిపురం మండలం కడపలే సమీపంలోని శివపురం వద్ద వారి సొంత ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ట్రస్టు చంద్రబాబు నాయుడు సంకల్పంతో పురుడు పోసుకుందని చెప్పారు. వరుసగా చంద్రబాబును గెలిపిస్తున్న కుప్పం కుటుంబ సభ్యులు అభిమానానికి ఏమిచ్చినా రుణం తీరదన్నారు. తమ సొంత ఇంటి నిర్మాణం ఆరు నెలల్లో పూర్తి అవుతుందని అది పూర్తి అయితే కుప్పం ప్రజలకు మరింత దగ్గర ఉండేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.