భారత దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తి అంటే చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఎన్వీ రమణ ను నియమించాలని ప్రస్తుత సీజేఐ ఎస్ఏ బాబ్డే ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి జస్టిస్ రమణ పేరు సిఫార్సు చేస్తూ లేఖ రాశారని అంటున్నారు. జస్టిస్ రమణ.. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి గా ఉన్నారు అని జస్టిస్ బాబ్డే రాసిన లేఖలో పేర్కొన్నారు. సీజేఐ ఎస్ఏ బాబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో మీ వారసుడిని ప్రకటించాలని కేంద్రం కోరింది.
దీంతో ఆయన ఈ సిఫార్సు చేశారు. ఇక జస్టిస్ బాబ్డే ప్రతిపాదనను కేంద్ర న్యాయ శాఖ సమీక్షించిన తర్వాత కేంద్ర హోంశాఖకు పంపుతుంది. కేంద్ర హోంశాఖ పరిశీలన తర్వాత రాష్ట్రపతి కార్యాలయానికి ఈ ప్రతిపాదన వెళుతుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే సీజేఐ ఎంపిక పూర్తవుతుంది. రాష్ట్రపతి రాజముద్ర వేస్తే ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ బాధ్యతలు స్వీకరిస్తారు.