ప్రపంచ జనాభాలో అగ్ర స్థానంలో చైనా ఉన్న విషయం తెల్సిందే. 2020, నవంబర్ 1నాటికి చైనా జనాభా 141.78 కోట్లుగా ఉంది. అయితే జనాభా కట్టడికి చైనా కొన్ని దశాబ్దాలుగా కఠిన చర్యలు తీసుకుంటుంది. 1970 నుంచి 2016 వరకు ఆ దేశ ప్రజలు కేవలం ఒకే సంతానాన్ని కనాలనే విధానాన్ని చైనా ప్రభుత్వం కఠినంగా అమలు చేసింది. అనంతరం 2016 నుంచి ఇద్దరు పిల్లలను కనడానికి అనుమతి ఇవ్వగా తాజాగా గరిష్ఠంగా ముగ్గురు పిల్లలను కూడా కనొచ్చని స్పష్టం చేసింది.
ఈ మేరకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నేతృత్వంలో జరిగిన కేంద్ర కమిటీలో చైనా తన ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీలో సోమవారం మార్పు చేసింది. చైనాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దేశానికి యువత పట్టుకొమ్మల లాంటి వారని అంటారు. అయితే 1970వ దశకం చైనాలో కేవలం సింగిల్ చైల్డ్ పాలసీ అమల్లో ఉండడంతో యువత సంఖ్య గణనీయంగా తగ్గి ఆ దేశంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది.
2016లో ఇద్దరు పిల్లలకు అనుమతి ఇచ్చినా ఆశించిన స్థాయిలో ప్రభావం కనిపించలేదు. ఈ నేపథ్యంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చైనా కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు పిల్లల కొత్త విధానాన్ని అన్ని స్థాయిల్లోని పార్టీ కమిటీలు, ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. కాగా గత దశాబ్ద కాలంలో చైనా జనాభా కేవలం 7.2 కోట్లు మాత్రమే పెరగగా… జనాభా వృద్ధి రేటు కేవలం 0.53 శాతంగానే ఉంది.