ప్రపంచ వ్యాప్తంగా ఓ వైపు అన్ని దేశాల్లోనూ కరోనా పడగ విప్పుతోంది. అయితే ఆశ్చర్యకరంగా చైనాలో మాత్రం కరోనా తగ్గుముఖం పడుతోంది. అందుకు ఆ దేశం తీసుకుంటున్న జాగ్రత్తలే కారణం. అలాగే చైనాలో పెద్ద ఎత్తున కరోనా బాధితులకు ట్రీట్‌మెంట్ ఇచ్చి వారు రికవర్ అయ్యాక ఇండ్లకు పంపుతున్నారు కూడా. అయితే చైనాలో ఇప్పుడు కరోనా అనుమానితులను సులభంగా కనిపెట్టేందుకు అక్కడ స్మార్ట్ హెల్మెట్లను వాడుతున్నారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ఇతర దేశాల కన్నా ముందే ఉండే చైనా.. కరోనా అనుమానితులను గుర్తించేందుకు నూతన తరహా హెల్మెట్లను ఉపయోగిస్తోంది. వీటిని స్మార్ట్ హెల్మెట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చైనాలో పోలీసులు ఈ స్మార్ట్ హెల్మెట్లను ఉపయోగిస్తున్నారు. వీటికి ముందు భాగంలో ఒక డిస్‌ప్లే ఉంటుంది. దానికి పలు సెన్సార్లు బిగించబడి ఉంటాయి. ఈ క్రమంలో ఆ డిస్‌ప్లే గుండా ఎదురుగా ఉన్న ఎవరినైనా చూస్తే వారి శరీర ఉష్ణోగ్రత ఆటోమేటిగ్గా రియల్‌టైంలో కనిపిస్తుంది. దీంతో కరోనా లక్షణాలు ఉన్నవారిని చాలా తేలిగ్గా గుర్తించవచ్చు.
ఇక సదరు స్మార్ట్ హెల్మెట్లు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహాయంతో పనిచేస్తాయి కనుక.. వాటితో కార్ల నంబర్ ప్లేట్లను కూడా స్కాన్ చేసి ఆ కార్లు ఏవైనా కేసుల్లో నమోదు కాబడ్డాయా అన్న వివరాలు తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ హెల్మెట్లను చైనాలో పోలీసులు చాలా తక్కువ సంఖ్యలో ఉపయోగిస్తున్నారు. కానీ త్వరలోనే పెద్ద ఎత్తున వీటిని అక్కడ వినియోగించనున్నారు. ఇక ఈ హెల్మెట్లకు చెందిన వీడియో ఒకటి ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది..!