కొవిడ్ -19 వైరస్‌.. మరో ఘన రికార్డుపై క‌న్నేసిన చైనా..!

-

కొవిడ్ -19 (కరోనా వైరస్).. ఈ పేరు చెబితేనే చాలా మంది వణుకుతున్నారు. రోజురోజుకీ ఈ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇటీవల పదంటే పది రోజుల్లో 1000 పడకల ఆసుపత్రిని నిర్మించి, తన శ్రామిక సత్తాను ప్రపంచానికి చాటిన చైనా, ఇప్పుడు మరో ఘనతను సాధించనుంది. కేవలం ఆరు రోజుల వ్యవధిలో బీజింగ్ ఓ ఫ్యాక్టరీని నిర్మించాలని నిశ్చయించింది. రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతూ ఉండటం, చాలినన్ని మాస్కులను సరఫరా చేయలేకపోతూ ఉండటంతో, రోజుకు 2.50 లక్షల మాస్క్ లను తయారు చేసేలా ఈ ఫ్యాక్టరీని నిర్మించాలని కంకణం కట్టుకుంది.

సోమవారం నాడు ఫ్యాక్టరీ నిర్మాణం పనులు ప్రారంభం కాగా, ఆదివారం నాటికి నిర్మాణాన్ని పూర్తి చేసి, ఆ వెంటనే ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు చైనా అధికారులు తెలిపారు. షిఫ్ట్ ల వారీగా ఇక్కడ 24 గంటలూ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. కాగా, కొవిడ్ -19 వైరస్ సోకి చైనాలో ఇంతవరకూ 1800 మందికి పైగా మరణించారు. నిన్న ఒక్కరోజే దాదాపు 100 మంది మరణించారని వైద్య వర్గాలు వెల్లడించాయి. వైరస్ సోకిన వారి సంఖ్య 70 వేలకు పైగానే ఉందని అధికారులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version