ఇటీవల డీఏవీ స్కూల్‌లో ఓ చిన్నారిపై అత్యాచారం జరగడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. స్కూల్ ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రజనీకుమార్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనతో విద్యార్థులు తల్లిదండ్రులు భగ్గుమన్నారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా గర్జించారు. తాజాగా ఈ ఘటనపై టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి స్పందించారు. నాలుగేళ్ల పసిబిడ్డపై స్కూల్ లో జరిగిన అత్యాచారం, అఘాయిత్యం తనను బాగా కలచివేసినట్టు వెల్లడించారు. అటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించాలని పేర్కొన్నారు చిరంజీవి.
అంతేకాకుండా, ప్రభుత్వాలు అన్ని విద్యాసంస్థల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు చిరంజీవి. భావితరాలకు భరోసా కల్పించడం మనందరి సమష్టి బాధ్యతగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు. ఇలాంటి భయానక ఘటనలు ఇంకెప్పుడూ జరకుండా చూడాలని పిలుపునిచ్చారు చిరంజీవి.