Breaking : మయన్మార్‌లో సైనిక పాలన అరాచకం.. 80 మంది మృతి

-

మయన్మార్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తుండటంతో వారిని అణిచివేసేందుకు వైమానిక దాడులకు దిగింది సైన్యం. ఈ దాడుల్లో దాదాపు 80 మంది మరణించినట్లుగా సమాచారం. మృతుల్లో ఒక గాయకుడితోపాటు వ్యాపారవేత్తలు, సామాన్య పౌరులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను స్థానిక దవాఖానకు తరలించారు. కచిన్‌ రాష్ట్రంలో జరుపుకుంటున్న వేడుకలపై సైన్యం విరుచుకుపడటంతో మారణకాండ చోటుచేసుకున్నది. మయన్మార్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో పలువురు గాయకులు, సంగీత విద్వాంసులు సహా 80 మందికి పైగా మరణించారు. వందకు పైగా గాయపడినట్లు తెలుస్తున్నది. కచిన్ జాతి మైనారిటీ గ్రూపునకు చెందిన ఓ రాజకీయ సంస్థ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించగా.. వారు హాజరైనట్లుగా తెలుస్తున్నది. మూడు జెట్‌ ఫైటర్లతో సైన్యం నాలుగు బాంబులు జారవిడిచింది.

ఆంగ్‌సాన్‌ సూకీ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్న అనంతరం సైన్యం జరిపిన దాడుల్లో ఇది అతి పెద్దదిగా చెప్పవచ్చు. ఆర్మీ సైనిక శిక్షణ కోసం ఉపయోగించే హపకాంత్‌ టౌన్‌షిప్‌లోని ఆంగ్‌ బార్లే గ్రామానికి సమీపంలో దాడులు జరిగాయి. మయన్మార్‌లో విస్తృతంగా జరుగుతున్న హింసాకాండపై చర్చించేందుకు ఆగ్నేయాసియా దేశాల విదేశాంగ మంత్రులు ఇండోనేషియాలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్న మూడు రోజుల ముందుగా ఈ దాడులు జరుగడం గమనార్హం. కాగా, కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ 9వ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగినట్లు మిలటరీ ప్రభుత్వ సమాచార కార్యాలయం సోమవారం అర్థరాత్రి ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. కచిన్ గ్రూపు ఉగ్రవాద చర్యలకు ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లుగా పేర్కొనడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version