వాస్తు నేపథ్యంలో నదికి ఎడమ పక్కగా అంటే.. ఉత్తరాన నదీపాయ ఉంటే మంచి జరుగు తుందని, అధికారం శాశ్వతం అని కొందరు నిపుణులు చెప్పడంతో ఆయన ఎవరు ఎన్ని విధాల వ్యతిరేకిం చినా కూడా అమరావతిలోనే నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే 2015లో హడావుడిగా ఆయన రాజధాని నిర్మాణాలకు మొగ్గు చూపారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని ఏపీకి పిలిచి ఆయన చేతుల మీదుగా నిర్మాణానికి శంకు స్థాపన చేయించారు. ఇక, దేశంలోని పలు జీవ నదుల నుంచి నీటిని, మట్టిని కూడా సేకరించి ఇక్కడ పెద్ద హడావుడి చేశారు. ఇక, ఆ తర్వాత సింగపూర్, జపాన్‌ల నుంచి కూడా ఆర్కిటెక్ట్ సంస్థలను రంగంలోకి దింపి పెద్ద ఎత్తున ప్లాన్‌లు వేశారు.
అదే సమయంలో కీలక నిర్మాణాలకు సినీ దర్శకుడు రాజమౌళి నుంచి సలహాలు తీసుకున్నారు. ఇక, రాజధానిలో ఏం జరుగుతోంది? అనే ప్రశ్న ఉదయించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఇక్కడకు ఆహ్వానించి చూపించారు. ఇలా.. తనదైన శైలిలో చంద్రబాబు రాజధానిని ప్రపంచ పటంలో నిలుపుతానని ప్రకటనలు గుప్పించారు. కానీ, విషయం మాత్రం ఎక్కడి గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుకు తాత్కాలిక భవనాలు నిర్మించారు తప్పితే.. పెద్దగా శాశ్వత నిర్మాణాలు ఒక్కటంటే ఒక్కటి కూడా చేపట్టలేదు. అయితే, మళ్లీ తమను గెలిపిస్తే.. రాజధానిని నిర్మిస్తామని, లేక పోతే. అభివృద్ధి ఆగిపోతుందని పెద్ద ఎత్తున ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు.
అయినా కూడా ప్రజలు చంద్రబాబును గెలిపించలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు రాజధానిలో చంద్రబాబు పేరును పూర్తిగా చెరిపి వేసేలా నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్నారు. మరి దీనిపై ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా.. బాబుకు ఇది ఊహించని పరిణామం. ఆయనను నమ్మి ఇక్కడ భూములు కొనుగోలు చేసిన వారు (ఖచ్చితంగా ఆయన పార్టీకి చెందని పారిశ్రామిక వేత్తలే ఉన్నారు), పెట్టుబడులు పెట్టిన వారు పూర్తిగా దెబ్బతింటారు. ఇది భవిష్యత్తులో చంద్రబాబుకు, పార్టికి కూడా ఇబ్బందేనని అంటున్నారు పరిశీలకులు.