ఒక పక్క చాక్లేట్ లారీ తగలబడుతుంటే… కొందరు జనం తినడానికి స్పూన్లు పట్టుకుని వెళ్లిన ఘటన ఇంగ్లాండ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… నట్స్‌ఫోర్డ్‌లోని M56 సమీపంలో సమీపంలో ఒక లారీ వెళ్తుంది. ఈ లారీలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దీనితో అక్కడ ఉన్న స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ మంటలు అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి పెద్ద తలనొప్పిగా మారింది.
దాదాపు మూడు గంటల పాటు ప్రయత్నించినా లారీలో మంటలు అదుపులోకి రాలేదు. దీనితో ముందు జాగ్రత్తగా ఆ వైపు వచ్చే బిజీగా ఉన్న రహదారిపై అన్ని దారులు అధికారులు మూసేసారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. మంటలను గమనించిన డ్రైవర్ ముందే దిగడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇక మంటలు ఆర్పడడంలో ఆలస్యం జరుగుతుండటంతో అధికారులు అక్కడి స్థానికులను కూడా హెచ్చరించారు. ఇంత వరకు బాగానే ఉన్నా… అక్కడ కొందరు ప్రవర్తించిన తీరు మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించింది.
వాస్తవానికి అది చాక్లేట్ లారీ… దీనితో ఆ మంటల వేడికి చాక్లేట్ రోడ్డు మీద కారుతుంది. దీనిని గమనించిన అక్కడి ప్రజలు కొందరు అధికారులు చెప్తున్నా వినకుండా… స్పూన్ తో… చాక్లేట్ ని తినే ప్రయత్నం చేయడం ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంటల ధాటికి పెద్ద ఎత్తున పొగతో ఆ ప్రాంతం మొత్తం దుర్వాసన వస్తుందని అక్కడి స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ రహదారిని మూసేసిన అధికారాలు… త్వరలోనే సమాచారం ఇస్తామన్నారు.