గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పార్టీ మారడం ఏమో గాని విపక్ష టీడీపీ లో ఆయన పెట్టిన చిచ్చు మాత్రం ఇప్పట్లో ఆరేలా కనపడటం లేదు. రాజకీయంగా ఒక పక్క ఇబ్బంది పడుతూ పార్టీ ని నిలబెట్టాలని చంద్రబాబు నానా ప్రయత్నాలు చేస్తుంటే ఉన్న నేతలు ఒక్కొక్కరు జారడం, జారే ముందు విమర్శలు చేయడం చంద్రబాబుకి ఇబ్బందిగా మారింది… కార్యకర్తలు కూడా ఇన్నాళ్లు దూకుడుగా కనపడిన వాళ్ళు ఈ పరిణామాలు చూసి సైలెంట్ అయిపోయారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్ధం కాక ఇంకా ఆశ్చర్యంలోనే ఉండిపోయారు.
వంశీ గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసారు. ఆ తర్వాత… ఒక టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ఈ విమర్శలపై తెలుగుదేశం శ్రేణులు భగ్గుమన్నాయి. ఇన్నాళ్లు లేనివి ఇప్పుడు ఎందుకు వచ్చాయని రాజకీయ భవిష్యత్తు చూపించిన టీడీపీని ఆ విధంగా విమర్శించడం ఏ విధంగా సబబు అని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇక్కడే పార్టీలో ఒక సమస్య వచ్చిపడింది. వంశీ విమర్శిస్తుంటే… పక్క నియోజకవర్గం పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఎందుకు స్పందించడం లేదు,
వాటిని ఎందుకు ఖండించడం లేదని ఎమ్మెల్సీ సహా పలువురు బోడెపై అసహనంగా ఉన్నారు. బోడె వంశీ స్నేహితులు అనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు వంశీ బయటకు వెళ్లిపోయారు. రాజకీయాలు వేరు స్నేహం వేరు, నోటికి వచ్చినట్టు విమర్శలు చేస్తుంటే కనీసం స్పందించి వాటిని తప్పు అని కూడా చెప్పకపోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొందరు స్థానిక నేతలుకూడా దీనిపై స్పందించకపోవడం టీడీపీలో చీలికకు నిదర్శనమని, అసంతృప్తికి ఉదాహరణ అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక బోడె కూడా పార్టీ మారే అవకాశం ఉందని, అందుకే ఆయన సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు.