విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మట్టి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనిత పాల్గొన్నారు. అయితే, గత వారం రోజులుగా సీఎం చంద్రబాబు విజయవాడలోనే ఉంటున్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జిల్లాలోనే బస చేస్తున్నారు.
బుడమేరు వాగుకు గండ్లు పడటంతో విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే. చాలా ఇళ్లు నీట మునిగాయి. సామగ్రి పూర్తిగా తడిచిపోవడంతో సామాన్య ప్రజలు సర్వం కోల్పోయారు.ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం తరఫున అందుతున్న సహాయక చర్యలపై అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సీఎం నివేదికలు తెప్పించుకుంటున్నారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు.