దేవుడి దయ ఉంటే 30లక్షల మందికి ఆగష్టు 15న ఫ్లాట్లు కేటాయిస్తామని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తామన్నారు. విజయవాడ జిల్లాలోని 33 ఎకరాలలో 1600 మందికి ఇళ్ల పట్టాలను ఇస్తున్నామని సీఎం తెలిపారు. ఎకరాకి మూడు కోట్ల రూపాయలు ఉన్నా, ఇచ్చిన మాట కోసం పేదలకు ఫ్లాట్లు ఇస్తున్నామని చెప్పారు. అర్హత ఉండి ఇళ్లు రానివారు దరఖాస్తు చేసుకుంటే… తప్పకుండా స్థలం కేటాయిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో 17వేల లే అవుట్లు వేసి 30లక్షల మంది పేదలకు ఫ్లాట్లు ఇస్తున్నామని.. అన్ని చోట్ల ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20కోట్ల మొక్కల నాటాలని నిర్ణయించామని తెలిపారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించేలా కృషి చేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.