టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఆయన నాలుగు రోజుల క్రితం కందుకూరులో రోడ్ షో నిర్వహించగా తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనను మరువకముందే ఇవాళ చంద్రబాబు గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో వస్త్రాల పంపిణీకి నిర్వహించిన బహిరంగసభలో మరోసారి తొక్కిసలాట చోటుచేసుకుంది.ఈ తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. . ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య మూడుకు చేరింది. క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
దాంతో పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారు గోపిరెడ్డి రమాదేవి, సయ్యద్ ఆసియాగా గుర్తించారు. ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మరణించడం కలచివేసిందని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు. అటు, రాష్ట్ర ఆరోగ్యమంత్రి విడదల రజని గుంటూరు జీజీహెచ్ లో బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాల నుంచి వివరాలు తెలుసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ముస్తఫా, ఎమ్మెల్యే అప్పిరెడ్డి కూడా బాధితులను పరామర్శించారు.