పాడేరు బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

-

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు వద్ద ఓ ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందడం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుమారు 100 అడుగుల లోయలో పడ్డ ఈ ఘటనలో.. ముగ్గురు మృతిచెందారు. సుమారు 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం కోసం అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశం ఇచ్చారు. క్షతగాత్రులకు మంచి ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని.. ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు సీఎం.

అంతేకాకుండా.. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారులకు తెలిపారు. ఘటనకు దారితీసిన కారణాలపై అధికారులు దృష్టి సారించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. మరోవైపు ఈ బస్సు ప్రమాదానికి కారణాలను బస్సు డ్రైవర్ భాస్కర్ రావు తెలిపాడు. ప్రమాదం జరిగే ముందు మలుపులో ఓ బైక్ వేగంగా వస్తుందని.. దానిని తప్పించే క్రమంలో పిట్టగోడను ఢీకొట్టి బస్సు లోయలో పడినట్లు చెప్పాడు. ఈ ప్రమాదంమధ్యాహ్నం 3గంటల సమయంలో జరిగిందని డ్రైవర్ తెలిపాడు. విశాఖ నుంచి పాడేరు వెళుతుందని.. ప్రమాదం జరిగే సమయంలో 25మంది ప్రయాణీకులు ఉన్నారన్నాడు. ప్రస్తుతం డ్రైవర్ కూడా తీవ్ర గాయాలు కావడంతో పాడేరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version