అధికారంలోకి వచ్చాక ఏపీలో ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రారంభించిన సీఎం జగన్.. తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు. అదే వైఎస్ఆర్ లా నేస్తం. ఈ పథకం కింద లబ్దిదారులైన జూనియర్ లాయర్లకు ప్రభుత్వం ప్రతి నెల రూ.5వేలు స్టైఫండ్ ఇస్తుంది. జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3న ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.
‘వైఎస్ఆర్ లా నేస్తం’ పథకం ప్రకారం కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో స్థిరత్వం పొందే వరకు.. అంటే మూడేళ్ల పాటు నెలకు రూ.5వేలు చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఇక జగన్ మాట్లాడుతూ.. లాయర్ల సంక్షేమం కోంస రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనికి ప్రతి బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. లాయర్ల చట్టంలో సవరణలపై ప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.