స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. విజయవాడ ఏసీబీ కోర్డు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా.. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అరెస్టు కావటం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి. చంద్రబాబు అరెస్టుతో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో చంద్రబాబు అరెస్టు కావటం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా అలజడి సృష్టిస్తోంది.
చంద్రబాబు అరెస్టు విషయమై తెలంగాణలోని వివిధ పొలిటికల్ పార్టీలకు చెందిన నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎక్కడా నోరు మెదపటం లేదు. ఒక్క తుమ్మల నాగేశ్వరరావు మాత్రమే చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఇదిలా ఉండగా.. బాబు అరెస్టుపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. గత నాలుగు రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలపై మినిట్ టూ మినిట్ అప్డేట్స్ తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఏపీలోని పలువురికి ఫోన్లు చేయించి అక్కడి పరిస్థితిలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. కేసీఆర్ ఆరా తీయటానికి కారణం లేకపోలేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత.. చాలా మంది టీడీపీ నేతలు,కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.