మాకు కులం, మతం, జాతి భేదం లేదు : సీఎం కేసీఆర్‌

-

సూర్యాపేట జిల్లా కావడమే ఒక చరిత్ర అని, చాలా అభివృద్ధి చెందిందని సీఎం కేసీఆర్ అన్నారు. అందరి కృషితోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని అన్నారు. సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌(కలెక్టరేట్), ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికలు రాగానే కొత్త బిచ్చగాళ్లు వచ్చి మాయమాటలు చెబుతారని, ప్రజలెవరూ నమ్మొద్దన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌, సమీకృత వ్యవసాయ మార్కెట్‌, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్‌ కాలేజీ, బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సూర్యాపేట ప్రగతి నివేదిన సభలో ప్రతిపక్షాలపై మండిపడ్డారు సీఎం కేసీఆర్.ఎన్నికలు రాబోతున్న సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వాళ్లు తమకు ఒక అవకాశం ఇవ్వండని అడుగుతున్నారని, కాంగ్రెస్ కు 50 ఏళ్లు అవకాశం ఇస్తే ఏం చేశారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన చాలా మంది నాయకులు మంత్రులుగా పని చేశారని, సూర్యాపేటను వాళ్లు ఏనాడైనా అభివృద్ధి చేశారా..? అని ప్రశ్నించారు. సూర్యాపేట, భువనగిరి, నల్గొండలో మెడికల్‌ కాలేజీలు పెట్టాలని ఎప్పుడైనా అనుకున్నారా..? సూర్యాపేట, నల్గొండ గతంలో ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నాయి..? అని అడిగారు.కాంగ్రెస్ నేతలు రైతుల కష్టాలు తీర్చాలని ఏనాడైనా ఆలోచించారా..? అని అడిగారు.

రూ.4 వేలు వృద్ధాప్య పింఛను ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారని, వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో రూ.4 వేల పింఛను ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో రాష్ట్రానికో నీతి ఉంటుందా..? అని అన్నారు. తాము కూడా పింఛన్లు తప్పకుండా పెంచుతామన్నారు. పింఛన్లు ఎంతకు పెంచుతామన్న విషయాన్ని త్వరలోనే చెబుతామన్నారు.తమకు కులం, మతం, జాతి లేదన్నారు సీఎం కేసీఆర్. అందర్నీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులను చిన్నచూపు చూశారని చెప్పారు. సర్కార్ ను నడిపించాలంటే సంసారం నడిపించాన్నట్లే ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version