విజయవాడలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పై ఉండవల్లి అరుణ్ కుమార్ స్మారకోపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. భారతదేశ స్వాతంత్ర్య సమరంలో తెలుగువారి పాత్ర గణనీయమైనదన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి పోరాట పటిమ ఎంతో గొప్పదని ఆయన కొనియాడారు. ప్రకాశం పంతులు గారు బారిష్టర్ చదివిన అడ్వకేట్ అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజాప్రతినిధిగా, ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి గా టంగుటూరి సేవలు మరువలేనివని ఆయన అన్నారు. రాజకీయాలు కెరీర్ గా ఎంచుకోవాలంటే చాలా సాహసం కావాలన్నారు మంద్రి ఆదిమూలపు. రాజకీయాలలోకి వెళ్ళాలా అని ఒక కుర్రాడు ఈరోజుల్లో తల్లిని అడిగితే చెంప ఛళ్ళుమనిపిస్తుందని, ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి యూనివర్సిటీ అని నామకరణం చేయడం జరిగిందన్నారు. గతంలో ఒక జీఓ ఇచ్చి అసలు యూనివర్సిటీ నే లేకుండా చేసారని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ తెచ్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు.
అనంతరం.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. రాజకీయం ఒక వ్యసనమేనని, ఏ ప్రతిఫలం ఆశించకుండా రాజకీయానికి వెచ్చించారు టంగుటూరి అని ఆయన అన్నారు. పొలిటీషన్ అవాలనుకుంటే you should study your own interest to become a politician అని బెర్నార్డ్ షా అన్నాడని, పేదరికాన్ని ప్రేమించాం కనుక రాజకీయంలో ఉన్నాం అని వావిలాల చెప్పారన్నారు. టంగుటూరి ప్రకాశం పేదరికంలో పుట్టి తన సంపాదన మొత్తం వదులుకున్నాడని, 75వేల రూపాయల ఫీజు 1975 లో భరణం కేసులో తీసుకున్నాడు టంగుటూరి అని ఆయన అన్నారు. దేవుడే ప్రకాశం పంతులుగా పుట్టాడు అని ఒక పెద్దాయన చెప్పారని, పొలిటీషియన్ తన గురించి తాను ఆలోచించనంత కాలం ప్రజలు అతని గురించి ఆలోచిస్తారన్నారు.