ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉదయం 11:30 గంటలకు ప్రగతి భవన్‌లో పోలీసు ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఆయన సమీక్షించనున్నారు. శాంతి భద్రతలు, మహిళల భద్రత, అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్ అరికట్టడం, గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించ నున్నారు. అవసరమైన కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్లు సమాచారం.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కాంగ్రెస్‌తోపాటు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఖమ్మంలో మైనర్ బాలికపై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ ఘటనపై పలు పార్టీలు, విద్యార్థి సంఘాలు కూడా ఆందోళనలు చేపడుతున్నాయి. ఈక్రమంలోనే ఖమ్మం ఘటనపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశానికి పోలీస్ శాఖ, అటవీ శాఖ మంత్రులు, కార్యదర్శులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, అడిషనల్ డీజీపీలు, డీఐజీలు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలు హాజరుకానున్నారు.