సీఎం కేసిఆర్ డిల్లీ పర్యటనలో ఏం జరిగింది ?

-

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన ముఖ్యమంత్రి కేసిఆర్ డిల్లీ పర్యటనపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ డిల్లీ పర్యటన ఆకస్మికంగా జరిగిందా లేక ముందస్తు షెడ్యులులో ఉందా? ఈ టూర్‌ ద్వారా సీఎం కేసీఆర్‌ పంపిన సంకేతాలు ఏంటి? అని ఆరా తీస్తున్నాయి రాజకీయ వర్గాలు. గతంలోనూ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాలను ఢిల్లీ వెళ్లి కలిసొచ్చారు సీఎం కేసీఆర్‌. అప్పుడెప్పుడూ ఈ స్థాయిలో రాజకీయ చర్చ జరగలేదు. కానీ.. ఆయన ఢిల్లీ వెళ్లిన టైమింగ్‌.. జరుగుతున్న రాజకీయ పరిణామాలే వేడి పుట్టిస్తున్నాయి.

మోడీ, షాలతో భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదన్నది టీఆర్‌ఎస్‌ వర్గాల వాదన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే రాజ్యంగపరమైన సమావేశాలే తప్ప.. అంతకుమించి ఏం లేదని చెబుతున్నాయి. కానీ.. రైతుల భారత్‌బంద్‌కు మద్దతు ప్రకటించిన తర్వాత ప్రధాని మోడీ, అమిత్‌షాతోపాటు పలువురు కేంద్రమంత్రులను కలవడం రాజకీయవర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయింది.

దుబ్బాక, జీహెఛ్ఎంసీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల తూటాలు పేలాయ్‌. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. ఆ వేడి చల్లారక ముందే ఢిల్లీ వెళ్లి మోడీ ఇతర కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. అయితే మోడీ, షాలను కేసీఆర్‌ ఏం అడిగారన్నది బయటకు రాలేదు. పైగా ఏకాంత చర్చలు జరగడంతో మరింత ఉత్కంఠ పెరుగుతోంది. ఎవరికి తగ్గట్టుగా వారు విశ్లేషణలు చేస్తున్నారు.

కేంద్రంతో రాష్ట్రానికి ఎటువంటి పేచీ లేదన్న సంకేతాలు సీఎం కేసీఆర్‌ పంపారా? అదే నిజమైతే.. గులాబీ దళపతి ఆశిస్తున్నదేంటి? తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందన్న వాదన అన్ని వర్గాల్లోనూ ఉంది. ఇలాంటి వాదనకు ఎక్కడో ఒకచోట ఫుల్‌స్టాప్‌ పడాలి. అందుకు ఆలస్యం చేయకుండా ఢిల్లీ పర్యటన ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో తమకు సత్ససంబంధాలు ఉన్నాయనే సంకేతాలను కూడా పంపారని కొందరి వాదన. వ్యూహం అదే అయితే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు సానుకూల వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానిస్తున్నారు పార్టీ నాయకులు.

గ్రేటర్ ఎన్నికలు సందర్భంగా జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో సదస్సు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఆ తర్వాతే రైతుల బంద్‌కు మద్దతు తెలిపారు. మరి.. ఢిల్లీ పర్యటన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్‌ పోరాటం ఉంటుందా లేదా అన్న చర్చ మొదలైంది. ఒకేవేళ అలాంటి పోరాటానికి బ్రేక్‌ వేస్తే మాత్రం.. కేంద్రానికి స్నేహ హస్తం ఇచ్చినట్టేనన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మరి.. ఏం జరుగుతుందో కాలమే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version