తిరుపతి బై పోల్..ప్రధాన పార్టీల అభ్యర్ధుల్లో గందరగోళం

-

సిట్టింగ్‌ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మరణంతో తిరుపతి లోక్‌సభకు జరగబోయే ఉపఎన్నికలో ఏకగ్రీవం ఊసు లేకుండా అన్ని పార్టీలూ పోటీకి సై అంటున్నాయి. హడావిడి చేస్తున్నాయి కానీ.. అభ్యర్థుల ఎంపికలో నెలకొన్న గందరగోళమే చర్చకు కారణం అవుతోంది. అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ సమర శంఖం పూరించడం లేదు. అభ్యర్థి సిద్ధంగా ఉన్నా వైసీపీ పేరు వెల్లడించడం లేదు. బీజేపీ-జనసేన కూటమికి క్యాండిడేట్‌ ఫైనల్‌ ఎప్పటికి కొలిక్కి వస్తుందో తెలియదు. కాంగ్రెస్‌ బరిలో దిగడం ఇంకా అనుమానంగానే ఉంది..ఉప ఎన్నిక పై ఎందుకు ఇంత గందరగోళం…

కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరును ప్రకటించిన టీడీపీ.. రేస్‌లో అందరికంటే ముందున్నామనే సంకేతాలు పంపింది. అయితే ఏ ముహూర్తాన ఆమె పేరును ప్రకటించారో అప్పటి నుంచి అభ్యర్థి పనబాక లక్ష్మి ఉలుకు, పలుకు లేదు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు. కుటుంబంలో శుభకార్యం జరుగుతున్నందున ఆమె బిజీగా ఉన్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నా.. బరిలో దిగేందుకు పనబాక అంత సుముఖంగా లేరన్న ప్రచారం జరుగుతోంది. చివరి నిమిషంలో ఆమె హ్యాండిస్తారేమో అన్న ఆందోళన టీడీపీలో ఉందట.

అధికార వైసీపీలో కొంత విచిత్రమైన పరిస్థితి ఉంది. అభ్యర్థి సిద్ధంగా ఉన్నా అధికారికంగా ప్రకటించడం లేదు. డాక్టర్‌ గురుమూర్తి పేరును సీఎం జగన్‌ ఖరారు చేశారని చెబుతున్నారు. అయితే గురుమూర్తి అభ్యర్థిత్వాన్ని కొందరు ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నట్టు వైసీపీ ఇన్నర్‌ సర్కిల్స్‌ నుంచి టాక్‌ వినిపిస్తోంది. అయితే తన నిర్ణయం నుంచి సీఎం జగన్‌ వెనక్కి వచ్చే అవకాశం లేకపోవడంతో ఎమ్మెల్యేలు లోలోన మదన పడుతున్నారట. ఎన్నికల ఖర్చు ఎవరు భరించాలన్న అంశంపైనా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. వీరందరికీ సర్ది చెప్పి త్వరలోనే అభ్యర్థి పేరును ప్రకటించాస్తారని తెలుస్తోంది.

ఊపు మీదున్నట్టు కనిపిస్తోన్న బీజేపీలోనూ ఇదే తరహా గందరగోళం ఉందట. జనసేనతో కలిసి ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామని ఆ పార్టీ నేతలు పైకి చెబుతున్నా.. ఏ పార్టీ అభ్యర్థి అవుతారో స్పష్టత లేదు. అందులోనూ గందరగోళం. ఒకరోజు మా అభ్యర్థే పోటీలో ఉంటారు. జనసేన మద్దతు ఇస్తుందని బీజేపీ ప్రకటిస్తే.. ఇంకోరోజు ఇంకో నేత ఏ పార్టీ పోటీ చేయాలో ఇంకా నిర్ణయానికి రాలేదని చెబుతున్నారు. దాదాపు బీజేపీ పోటీ ఖరారు అయినట్టే ఆ పార్టీ చర్యలు కనిపిస్తున్నా.. ముసుగు మాత్రం తీయడం లేదు. బీజేపీ-జనసేన కూటమికి ఇప్పటి వరకు అభ్యర్థి దొరకలేదు. చాలామంది రిటైర్డ్‌ IAS, IPS, IRS అధికారుల పేర్లను రెండు పార్టీలు పరిశీలిస్తున్నాయి. కానీ.. వ్యవహారం తెగడం లేదు. ఇప్పట్లో కొలిక్కి వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి.

తిరుపతి లోక్‌సభ స్థానాన్ని కొన్నేళ్లపాటు కంచుకోటగా మలుచుకున్న కాంగ్రెస్‌లోనూ ఇదే అయోమయం ఉంది. ఇదే స్థానం నుంచి గతంలో పలుమార్లు గెలిచిన చింతా మోహన్‌నే అభ్యర్థిగా నిలపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఆయన మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. చింతా మోహన్‌ కాదంటే కాంగ్రెస్‌కు మరో అభ్యర్థి సిద్ధంగా లేరట. తిరుపతిలో ఇంతటి గందరగోళ వాతావరణాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version