తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు ముందు ఇతర పార్టీలు బేజారయిపోయాయి. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో కొన్ని చోట్ల మినహా దాదాపుగా టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతూ… క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. కనీసం 20కి పైగా మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని చూసిన కాంగ్రెస్ కు భంగపాటు ఎదురైంది. ఇటు బీజేపీకి కూడా ఓటర్లు చుక్కలు చూపించారు. ఇదిలా ఉంటే.. టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడనున్నారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. మొత్తం 120 మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ పార్టీ 109 మున్సిపాలిటీల్లో ముందంజలో ఉంది. కొన్ని మున్సిపాలిటీల్లో అయితే టీఆర్‌ఎస్ పార్టీ ఏకపక్ష విజయం సాధించింది. 9 కార్పొరేషన్లకు గానూ 5 కార్పొరేషన్లలో టీఆర్‌ఎస్ లీడ్‌లో ఉంది. దీనితో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.