రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం కేరళకు వెళ్లనున్నారు. వయనాడ్ ఉపఎన్నిక నేపథ్యంలో బుధవారం ఉదయం కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఎంపీగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రియాంక నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటారని సమాచారం. గత లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసి గెలుపొందారు.
రెండు చోట్లా విజయం సాధించడంతో బరేలీ నుంచి ఎంపీగా కొనసాగాలని రాహుల్ నిర్ణయం తీసుకోవడంతో వయనాడ్ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో వయనాడ్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంకగాంధీ పోటీ చేస్తున్నారు. ఆమె నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్‌తో పాటు కేరళలోని యూడీఎఫ్ నేతలు సైతం హాజరుకానున్నట్లు సమాచారం. కాగా, ప్రియాంకగాంధీ తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.