కాంగ్రెస్ నాయకుల ఆదేశాలతోనే మహబూబాబాద్ లో బీఆర్ఎస్ మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా తెలంగాణ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. మహాధర్నాకు అనుమతి ఇచ్చిన న్యాయ స్థానానికి ధన్యవాదాలు చెప్పారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంట్ లో ప్రమాణం స్వీకారం చేస్తారు. రేవంత్ రెడ్డి ఏమో అదే రాజ్యాంగాన్ని ఖూని చేస్తున్నారని విమర్శించారు. లగచర్ల గిరిజన రైతులు ఎదురు తిరగడం చూసి రేవంత్ రెడ్డి ఖంగుతిన్నారని ఆరోపించారు.
లగచర్ల రైతులను మెప్పించని రేవంత్ రెడ్డి.. రాష్ట్ర రైతులను ఎలా మెప్పిస్తారని ప్రశ్నించారు. కనీసం ఊరు దాటని గిరిజన మహిళలు, ఢిల్లీ వరకు వెళ్లి ఫిర్యాదు చేశారంటే.. తెలంగాణలో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. రేవంత్ రెడ్డి కళ్లు తెరిచి. లగచర్లలో ఫార్మా విలేజ్ ను రద్దు చేసుకోవాలని కోరారు. మానుకోటతో ఎవ్వరూ పెట్టుకున్న వారికి మూడుతుందని.. గతంలో కూడా కాంగ్రెస్ కు మూడిందన్నారు. ఇప్పుడు మానుకోట నుంచే రేవంత్ రెడ్డి పతనం స్టార్ట్ అయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు సత్యవతి రాథోడ్.