నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. BRS హయాంలో ఇచ్చిన అనుమతులపై పునరాలోచనలో కాంగ్రెస్ సర్కార్. ఇథనాల్ పరిశ్రమకు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులపై పునఃసమీక్ష చేసింది. ఇప్పటికే ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ గ్రామస్తుల ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. దీంతో గ్రామస్తులతో కలెక్టర్ అభిలాష అభినవ్ చర్చలు జరిపారు. ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులను నిరసన కారులు ఎదురించడం.. ఇథనాల్ ఫ్యాక్టరీనా.. మేమా? ఏదో ఒకటే ఉండాలన్నట్లుగా భీష్మించడంతో వారికి సర్దిచెప్పలేక పోలీసులు వారిని చెదరగొట్టారు. పోలీసుల మీద రాళ్ళు రువ్వుతూ, పురుగుల మందు డబ్బాలతో రైతులు నిరసనకు దిగారు. ఆందోళనకారుల్లో కొందరు రైతులను పోలీసులు అరెస్టు చేశారు. మహిళలు నిరసనల్లో ముందుండి పోరాడుతుండటంతో లా అండ్ ఆర్డర్ పోలీసులకు సవాల్ గా మారింది. తాజాగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.