ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయా కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కొడాలి నాని స్పందించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై విమర్శలు చేసే స్థాయి నారా లోకేష్ కు లేదని మండి పడ్డారు. సీఎం వైఎస్ జగన్ ను ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదని అన్నారు. నారా లోకేష్ కు వైఎస్ జగన్ వరకు ఎందుకు అని అన్నారు. దమ్ముంటే.. తనపై పోటీ చేసి గెలవాలని నారా లోకేష్ కు సవాల్ విసిరారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఆదరణ లేని చవటలు ఈ రోజు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలది అని అన్నారు. వైఎస్ జగన్ కు ప్రజాదరణ ఉందని స్పష్టం చేశారు. అందుకే అత్యధిక సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారని అన్నారు.
ఎమ్మెల్యేగా కూడా గెలవలేని నారా లోకేష్ ఒక అసమర్థుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని జోస్యం చెప్పారు. వికేంద్రీకరణ గురించి సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ లో వివరిస్తే.. ఎల్లో మీడియా అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు.