కాంగ్రెస్ శాసనసభా పక్షం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరుగనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల సమావేశాలకు అనుమతులు ఇస్తూ.. కాంగ్రెస్ కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వకపోవడంపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవేంద్ర అరాచకాలపై చర్చించే అవకాశం ఉంది. బాధితులకు ఎలా అండగా నిలవాలనే విషయాలను చర్చించనున్నట్లు సమాచారం.
దీంతో పాటు కాంగ్రెస్ పార్టీలో అసంత్రుప్తులపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇటీవల జగ్గారెడ్డి ఇష్యూ తెలంగాణ కాంగ్రెస్ ను కదిపేస్తోంది. తన వల్ల ఇబ్బంది ఎదురయితే పార్టీ నుంచి వెళ్లిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని జగ్గారెడ్డి ప్రకటించడం కూడా సంచలనంగా మారింది. ఇదే కాకుండా ప్రేమ్ సాగర్ రావు, మహేశ్వర్ రెడ్డి వంటి నాయకులు కాంగ్రెస్ నాయకత్వంపై బహిరంగంగానే విమర్శిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీకి ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వంటి వారు సమావేశానికి హాజరు అవుతున్నారు.