కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తి చేసుకోవడం, బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయి కూడా ఏడాది పూర్తయినందున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెన్సేషనల్ ట్వీట్ చేశారు. ‘ఎంత గట్టిగా కొట్టగలమనేది కాదు..ఎంత సాధించగలమనేదే’ ముఖ్యమని అన్నారు. ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగించాలని, బీఆర్ఎస్ పార్టీకి గత సంవత్సరం అనేక ఒడిదుడుకులు, సవాళ్లతో నిండిన కష్టతరమైన సంవత్సరాలలో ఒకటి అని చెప్పారు.
‘ఏడాది పూర్తయ్యాక కూడా ఇక్కడ మేము పోరాడుతున్నాము. మా తెలంగాణ ప్రజల కోసం నిలబడతాము అనేది నిరూపించాం.అందుకు ధైర్యంగా నిలిచిన మా అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వానికి, మా నాయకులకు, అట్టడుగు వర్గాల సైనికులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు’ అంటూ కేటీఆర్ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఈ పోరాటంలో అద్భుతమైన పాత్ర పోషిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా యోధులకు సైతం కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.