రాజస్థాన్ రాజకీయ సంక్షోభం తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్‌ను ఎంపిక చేయకూడదంటూ సీఎం అశోక్ గహ్లోత్ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 76 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు రాజీనామా పత్రాన్ని అందించారు. ముందుగా మంత్రి శాంతి ధరివాల్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యేలు.. సుదీర్ఘ చర్చల అనంతరం రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇప్పటివరకు ఎమ్మెల్యేల రాజీనామాపై స్పీకర్ కార్యాలయం ఎలాంటి ప్రకటన చేయలేదు.
రాజస్థాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేపట్టేందుకు అధిష్ఠానం పరిశీలకులుగా మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకన్ వచ్చారు. అయితే గహ్లోత్ వర్గం అందుబాటులో లేదని తెలుస్తోంది. అంతేగాక, కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల తర్వాతే రాజస్థాన్‌లో తదుపరి సీఎంను ఎంచుకోవాలని గహ్లోత్ వర్గం డిమాండ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఎమ్మెల్యేలు మూడు డిమాండ్లు అధిష్ఠానం ముందుంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యే వరకు రాజస్థాన్ తర్వాతి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోకూడదని, కొత్త సీఎం ఎంపికపై గహ్లోత్ అభిప్రాయానికి విలువ ఇవ్వాలని కోరినట్లు వివరించాయి.