తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుంది ? ఆ పార్టీకి చెందిన కీలక నేత, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచి పట్టున్న మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కమలం గూటికి చేరుతున్నట్టు సమాచారం. టీడీపీలో రాజకీయంగా కీలకంగా ఎదిగిన ఆయన ఎన్నో ఉన్నత స్థాయి పదవులు అలంకరించారు. జడ్పీటీసీగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన 1999లో ఖనాపూర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన 2004లో ఓడిపోయారు. అయితే అనూహ్యంగా 2006లో జడ్పీ చైర్మన్ అయ్యారు.
2008 ఉప ఎన్నికల్లో ఆయన భార్య సుమన్ బాయ్ రాథోడ్‌ను గెలిపించుకున్నారు. 2009 ఉప ఎన్నికల్లో ఆయన ఆదిలాబాద్ ఎంపీగా, ఆయన భార్య ఖనాపూర్ ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. 2014లో టీడీపీ నుంచి ఎంపీగా ఓడిపోయిన ఆయన ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరినా ఎంపీ, ఎమ్మెల్యే సీటు రాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి అడపా దడపా కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా అక్కడ కూడా ఆయనకు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ క్రమంలోనే తనతో పాటు తన వారసుడి రాజకీయ భవిష్యత్తు నేపథ్యంలో ఆయన కమలం గూటికి చేరుతున్నట్టు టాక్..?
ఇక రమేష్ కమలం ఎంట్రీని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు వ్యతిరేకించినా.. కమలం పెద్దలు సర్ది చెప్పడంతో ఆయన ఓకే చెప్పారట. వీరిలో సోయం బాబురావు ఆదివాసీ తెగకు చెందిన నాయకుడు కాగా రాథోడ్ లంబాడ గిరిజన సామాజిక వర్గానికి చెందిన నేత. ఇక రమేష్ రాథోడ్‌కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన్ను బీజేపీలోకి తీసుకు రావడంలో కిషన్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారని అంటున్నారు.