తెలంగాణలో కరోనా టెస్ట్ లు, చికిత్సలు పూర్తిగా గాడి తప్పినట్టు హైకోర్టు వ్యాఖ్యలతో స్పష్టమవుతోందని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. శాంపిల్స్ సేకరణ, ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం, చికిత్స తీరు జనాన్ని అయోమయంలోకి నెడుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. జర్నలిస్ట్ మనోజ్, రవికుమార్ ఇలా ఎన్నో ఉదాహరణలు కరోనా చికిత్స విషయంలో కేసీఆర్ దొర సర్కారు పని తీరులోని డొల్లతనాన్ని ఎండగడుతున్నాయన్నారు. అలాగే హెల్త్ బులిటెన్స్ లో అసమగ్ర సమాచారం…
దారి తప్పిన ఐసీఎంఆర్ నియమనిబంధనలు… రాష్ట్రస్థాయి అధికారుల సమాచారంలోనే సమన్వయ లోపం… ఇలా అన్ని విషయాల్లోనూ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఇదంతా ఒక కోణమైతే, మాస్క్ లేకుండా తిరిగేవారిపై 70 వేలకు పైగా కేసులు నమోదైన హైదరాబాదులో మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీసులు మాస్కులు లేకుండా, కనీస భౌతిక దూరం పాటించని దృశ్యాలు మీడియాలో దర్శనమిచ్చాయి. మీరే ఇలా ఉంటే ఇక ప్రజలకు ఎలా మార్గదర్శకులవుతారో… పరిస్థితిని ఎలా కంట్రోల్ చేస్తారో ఆ దేవుడికే తెలియాలి.” అని విజయశాంతి అన్నారు.