తెలంగాణాలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణాలో లాక్ డౌన్ ని డిసెంబర్ వరకు కొనసాగిస్తే మంచిది అంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. తెలంగాణలో డిసెంబరు వరకు లాక్‌డౌన్ పొడిగించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. అలా చేస్తేనే ఇటు ప్రజలు, అటు ప్రభుత్వానికి మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు
మే తర్వాత వరుసగా పండగలు వస్తాయన్నారు. బోనాలు, వినాయక చవితి, బతుకమ్మ, దసరా, మొహరం, దీపావళి, క్రిస్మస్ పండగలు ఉన్నాయన్న ఆయన… ప్రజలు ఎక్కువగా గుమిగూడడంతో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదముందని హెచ్చరించారు. పండగల కోసం లాక్‌డౌన్ ఎత్తేస్తే ఇన్నాళ్లు పడిన కష్టం వృథా అవుతుందని సూచించారు. ఇంకా 6 నెలల పాటు పొడిగించినా ప్రజలు వ్యతిరేకించరన్నారు.
ముందు మనం బతికితేనే అన్నీ చూడగలుగుతామని వ్యాఖ్యానించారు. అయితే పేద ప్రజలను ఆదుకోవాలని జగ్గా రెడ్డి కోరారు. తినేందుకు ఆహార ధాన్యాలు, సరుకులను అందజేయాలని సూచించారు. ఈ దిశగా పార్టీ కూడా ఆలోచన చేయాలని ఉత్తమ్ కుమార్‌ని కోరుతున్నా అన్నారు. సీఎం కూడా డిసెంబరు వరకు లాక్‌డౌన్ పొడిస్తారని అనుకుంటున్నా అంటూ జగ్గా రెడ్డి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేసారు.