మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కాంగ్రెస్ సర్కారుపై మరోసారి విమర్శల బాణాలు సంధించారు.ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్‌గా రేవంత్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాల నిర్వహణ అధ్వాన్నస్థితికి చేరుకున్నదని మండిపడ్డారు. ప్రభుత్వం 10 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యజమాని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌కు తాళం వేసిన దుస్థితిని గుర్తుచేశారు.
కాంగ్రెస్ సర్కారు గురుకులాలను పట్టించుకోవడం లేదని, వారి పాలనకు ఇదొక నిదర్శనమని ఫైర్ అయ్యారు. సీఎం గురుకులాలకు అద్దెలు ఇంకెప్పుడు చెల్లిస్తారని, కాంగ్రెస్ హయాంలో రోజురోజుకి దిగజారి పోతున్న విద్యావ్యవస్థ గురించి విద్యాశాఖ మంత్రిగా ఉన్న మీరు ఇంకెప్పుడు పట్టించుకుంటారని నిలదీశారు.గతంలో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద మంజూరైన 65 మంది బీసీ విద్యార్థులకు ఆర్థికసాయాన్ని ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు.కేసీఆర్ తెచ్చిన ఓవర్సీస్ ఫెలోషిప్ పథకాన్ని ఆపేయాలని కాంగ్రెస్ యోచిస్తోందా? కేసీఆర్ వారసత్వాన్ని తుడిచిపెట్టే ప్లాన్ ఇదేనా? ప్రశ్నించారు.