హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇప్పటికే పక్క రాష్ట్రం ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆ ఎఫెక్ట్ తెలంగాణ మీద కూడా పడింది. ఈ క్రమంలోనే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని పలు కీలక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలు కాలనీలు జలమయం అయినట్లు సమాచారం.
నగరంలోని ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, మేడిపల్లి, తార్నాక,సికింద్రాబాద్, అబిడ్స్, చార్మినార్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్‌లో, కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్, పటాన్ చెరు, బాలనగర్, భరత్ నగర్ వంటి ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. అయితే, నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయినట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా రోడ్లపై భారీగా వరద నీరు పేరుకుపోగా, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.