సూపర్ మార్కెట్లకు బిగ్ షాక్‌..క్యారీ బ్యాగ్ లు ఉచితంగా ఇవ్వాల‌ని ఆదేశాలు

సూపర్ మార్కెట్లు, షాపింగ్ సెంటర్లు, వ్యాపార వాణిజ్య సముదాయాలకు దిమ్మ తిరిగే షాక్ త‌గిలింది. క్యారి బ్యాగ్ పై షాప్ లోగో ఉన్నా, లేకున్నా ఇకపై కస్టమర్లకు ఉచితంగా ఇవ్వాల‌ని వినియోగదారుల ఫోరమ్ న్యాయస్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ హైదర్ గూడ డిమార్ట్ పై ఉన్న కేసును వినియోగదారుల ఫోరమ్ న్యాయస్థానం విచారించింది. ఈ సంద‌ర్భంగా కీల‌క తీర్పు ఇచ్చింది వినియోగదారుల ఫోరమ్ న్యాయస్థానం.

వినియోగదారుల నుండి క్యారీ బ్యాగ్ కోసం 3 రూపాయల 50 పైసలు తిరిగి చెల్లించడం తో పాటు పరిహారంగా వెయ్యి రూపాయలు చెల్లించాల‌ని.. అలాగే.. న్యాయ సేవాకేంద్రానికి మరో వెయ్యి రూపాయలు వినియోగదారునికి చెల్లించాలని హైదర్ గూడ డిమార్ట్ ను ఆదేశించింది కోర్టు. ఇప్పటి నుండి ఎలాంటి క్యారిబ్యాగ్ కు డబ్బులు వసూలు చేయద్దు అని వినియోగదారుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 45 రోజుల్లో తీర్పు అమలు కాకపోతే చెల్లించాల్సిన మొత్తానికి 18 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని తెలిపింది వినియోగదారుల ఫోరమ్ న్యాయస్థానం.