కొవిడ్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. కరోనా వైరస్ ధాటికి అన్ని రంగాలు కుప్పకూలాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. దీంతో కరోనాకు మందు ఎప్పుడు వస్తుందా అని యావత్ ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే అగ్రరాజ్యం అమెరికా ఒక తీపి కబురు అందించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని ఓ అధికారి కీలక ప్రకటన చేశారు. 2021 జనవరి నుంచి దేశంలో వ్యా క్సిన్ పంపిణీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్యశాఖ -కరోనా సేవల విభాగం సహాయక కార్యదర్శి రాబర్ట్ క్యాడ్‌లెక్ వెల్లడించారు.
సురక్షితమైన, ప్రభావవంతమైన వ్యాక్సిన్లను ఎంపిక చేసి, ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబరులోగా కనీసం ఒక వ్యాక్సిన్ కు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయని, అయితే దాని పంపిణీ ప్రారంభమయ్యేందుకు కొంత సమయం పట్టొచ్చని పేర్కొన్నారు. ఇక అమెరి కా ప్రభుత్వ వ్యాక్సిన్ అభివృద్ధి కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ మోన్సెఫ్ స్లావీ సైతం ఈ అంశంపై స్పందించారు. ‘‘ప్రస్తుతం ప్రయోగ పరీక్షల దశల్లో ఉన్న వ్యాక్సిన్లలో ఏదైనా ప్రభావశీలంగా ఉందా ? లేదా? అనేది ఈ నెలాఖరుకో.. నవంబరు లేదా డిసెంబరులోనో తేలిపోతుంది. ఆ తర్వాత దాని తో వ్యాక్సినేషన్‌కు అత్యవసర ప్రాతిపదికన అనుమతులు లభించడానికి ఇం కొన్ని వారాల సమయం పడుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.