టీటీడీ దర్శనాలను పునరుద్ధరించిన నాటి నుంచి ఇప్పటి వరకు శ్రీవారి ఆలయంతో పాటు ఇతర ఆలయాల్లో పూజా కైంకర్యాలు నిర్వహించే 25 మంది అర్చకులు కరోనా బారిన పడ్డారు. తిరుమలలో పెద్దజీయంగార్తో పాటు ఒకేసారి 16 మంది అర్చకులు కరోనా బారిన పడడంతో అర్చకుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తమైన తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి… శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు సహా ఇతర అర్చకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అర్చకులు బస చేసే అర్చక నిలయంను తాత్కాలికంగా మూసివేశారు. పూజా కైంకర్యాలకు ఆటంకం ఏర్పడకుండా డిప్యుటేషన్‌పై ఇతర ఆలయాల నుంచి శ్రీవారి ఆలయంకు తీసుకువచ్చారు. కరోనా ప్రభావంతో ఎక్కువగా ఉన్న వారిని చెన్నై అపోలో ఆస్పత్రిలో వైద్య సేవలు అందించి కోలుకునేలా చర్యలు తీసుకున్నారు.అర్చకులందరూ కోలుకున్నారనుకునే సమయంలో శ్రీనివాసాచార్యులు కరోనాతో మృతి చెందడం వారిని కలవరానికి గురిచేసింది. శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలు నిర్వహించేందుకు తిరుపతి కోదండరామస్వామి ఆలయం నుంచి ఎన్వీ శ్రీనివాసాచర్యులు డిప్యుటేషన్‌పై తిరుమలకు వచ్చారు. అయితే ఆయనకు నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలింది. చికిత్స కోసం పద్మావతి కొవిడ్ అసుపత్రికి తరలించగా అయితే కార్డియాక్ అరెస్టు కావడంతో వైద్యులు సీపీఆర్ వైద్యం చేసేందుకు ప్రయత్నించారు. శరీరం సహకరించక పోవడంతో గురువారం సాయంత్రం 4 గంటలకు మరణించినట్లు వైద్యులు తెలిపినట్లు టీటీడీ ప్రకటించింది.