యావత్తు ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేసిన కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. ఇప్పటికే విదేశాల్లో మళ్లీ విజృంభిస్తూ ప్రజలపై విరుచుకుపడుతోంది. ఇటీవల కరోనా పుట్టినిల్లు చైనాలో కరోనా కేసులు పెరగడంతో మహానగరమైన శాంఘై సిటీలో లాక్‌డౌన్ విధించారు. అయితే అక్కడ కఠిన కరోనా నిబంధనలు అమలు చేయడంతో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు భారత్‌లో పెరుగుతున్నాయి. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుందో.
అయితే నిన్న నమోదైన కేసుల కంటే నేడు తక్కువగా నమోదవడం కొంచె ఊరట కలిగించే విషయం. అయితే తెలంగాణలో.. గడిచిన 24 గంటల్లో 15,200 కరోనా పరీక్షలు నిర్వహించగా, 145 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క హైదరాబాదులోనే 117 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 75 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,94,329 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,89,241 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 977 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మరణించారు.